Pankaj Tripathi: బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. ఆయన సోదరి భర్త పంకజ్ బావ రాకేష్ తివారీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో సోదరి సరితకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరిత తన భర్త మరణ వార్త విని తల్లడిల్లింది. విషయం తెలుసుకున్న పంకజ్ ఆసుపత్రికి వెళ్లారు. తన బావ మృతి పట్ల తీవ్ర భావోద్వేగం చేందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య సరితతో కలిసి రాకేష్ తివారీ కార్లో బిహార్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరాడు. ఢిల్లీ, కోల్‌కతా జాతీయా రాహదారిపై కారు వేగంగా ప్రయాణిస్తుంది. అదే సమయంలో అక్కడ కూడలిలో ఒక చౌరస్తా రావడంతో కారును అదుపు చేయలేకపోయాడు. దీంతో వేగంగా దూసుకొచ్చిన వాహనం డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ధన్‌బాద్‌లోని ఆస్పత్రికి వారిని తరలించారు. అయితే దారి మధ్యలోనే రాకేశ్ తివారీ మరణించినట్లు పరీక్షించిన వైద్యులు నిర్దారించారు. ఈ ప్రమాదంలో సరితకు కాలు విరిగింది, ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.