కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి ప్రముఖ న్యాయవాది శాంతి భూషన్ ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో 1925, నవంబర్ 11న జన్మించారు. అడ్వట్ వృత్తి చేపట్టిన శాంతి భూషణ్ వివిధ హోదాల్లో పని చేశారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేశారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ (ఓ)లో పని చేసి, ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. 1977 నుంచి 1980 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో 1977-1979 వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. 1980లో ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.
దీని ద్వారా సుప్రీంకోర్టులో ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.2018లో కూడా ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. స్వాతంత్ర సమరయోధుడు రాజ్ నారాయణ్ తరఫున ఒక కేసు వాదించారు. ఈ కేసు 1974లో ఇందిరా గాంధీ ప్రధానిగా తొలగింపునకు కారణమైంది. అవినీతికి వ్యతిరేకంగా అనేక కేసులు వాదించారు. 44వ రాజ్యాంగ సవరణలోనూ ఆయన పాత్ర ఉంది. 1980లో బీజేపీలో చేరారు. అయితే, 1986లో తన నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరించినందుకుగాను ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్ కూడా ప్రముఖ న్యాయవాది.