మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 60 మంది మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Russian concert hall attack : రష్యాలోని మాస్కోలో భీకరమైన ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అక్కడ సిటీ కాన్సర్ట్ హాల్లోకి ముష్కరులు ప్రవేశించి ఇష్టా రీతిగా కాల్పులు జరిపారు. దీంతో 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యన్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఐదుగురు పిల్లలు సహా 145 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇప్పటికే 115 మందిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్సలు చేస్తున్నారు. అయితే రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ మాత్రం ఇప్పటి వరకు 40 మంది చనిపోయినట్లు చెబుతోంది. ఘటన గురించి తెలుసుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోగానే ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై అమెరికాలోని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్నీ వాట్సన్ మీడియాతో మాట్లాడారు. మాస్కోలో ప్రణాళిక ప్రకారం పెద్ద ఉగ్ర దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని నెల రోజుల క్రితం తమకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని చెప్పారు. కాన్సర్ట్‌లు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే లక్ష్యంగా ఈ దాడులు జరగవచ్చని తమకు సమాచారం అందిందని తెలిపారు. దీంతో ఈ సమాచారాన్ని వెంటనే రష్యన్ అధికారులతో పంచుకున్నామని అన్నారు. సామూహిక హత్యలు, కిడ్నాప్‌ల వంటి ముప్పు ఉందని ఆ దేశాన్ని తాము అలర్ట్ చేశామని చెప్పారు.
ఈ ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న రష్యా ప్రజలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలు త్వరగా ఆ బాధ నుంచి కోలుకోవాలని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు.