air craft crash : ఓ శిక్షణనిచ్చే ఎయిర్ క్రాఫ్ట్ బీహార్‌లోని పొలాల్లో కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఇందులో ఉన్న ఇద్దరు శిక్షణ పైలెట్లు అదృష్ట వశాత్తూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఓ లేడీ పైలెట్, జెంట్ ఆర్మీ పైలెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని గయ జిల్లా, బుద్ధ గయ సమీపంలోని కంచన్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శిక్షణ పైలెట్లు విమానాన్ని భూమికి 200 నుంచి 400 అడుగుల ఎత్తులో నడుపుతున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఎయిర్ క్రాఫ్ట్(air craft) ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది. దీంతో అది అక్కడి మైదాన ప్రాంతంలో కూలిపోయింది. ఘటన తర్వాత అక్కడికి చేరుకున్న ఆర్మీ అధికారులు ఆ ఎయిర్ క్రాఫ్ట్‌ని స్వాధీనం చేసుకున్నారు.
గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఆర్మీ సైనికులకు శిక్షణ అందిస్తుంటారు. అలా శిక్షణ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకు ముందు 2022లో కూడా శిక్షణ సమయంలో సాంకేతిక లోపంతో ఒక ఎయిర్ క్రాఫ్ట్(air craft) ఇక్కడి పొలాల్లో కూలిపోయింది. ఈ వరుస ఘటనల పట్ల స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.