మెరుగైన పాలన కోసం చట్టసభ సభ్యుల కదలికలను 24 గంటల పాటు పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. 24 గంటలు కదలికలను పర్యవేక్షించేందుకు వారి శరీరంలో చిప్ పెట్టాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Supreme Court: మెరుగైన పాలన కోసం చట్టసభ సభ్యుల కదలికలను 24 గంటల పాటు పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. 24 గంటలు కదలికలను పర్యవేక్షించేందుకు వారి శరీరంలో చిప్ పెట్టాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎంపీ, ఎమ్యెల్యేలను 24 గంటలూ పర్యవేక్షించమంటారా? ఇలాంటివి చట్టం నుంచి తప్పించుకునే వారి విషయంలోనే చేస్తారు. గోప్యతా హక్కు అనేది ఒకటుంది. ఎన్నికైన పార్లమెంటు సభ్యులందరిని డిజిటల్‌గా పర్యవేక్షించేందుకు వారి శరీరాల్లో చిప్ పెట్టలేం. అయినా వాదిస్తామంటే తర్వాత మీ వాదనలతో మేం ఏకీభవించకపోతే మీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తాం. ఇది ప్రజా సమయం. ముఖ్యమైనవి అనేక అంశాలున్నాయని సుప్రీంకోర్డు పేర్కొంది.
సుపరిపాలన ప్రజలకు అందాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలను అనుక్షణం పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దిల్లీకి చెందిన సురీందర్‌నాథ్ కుంద్రా సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా సేవకులని, కానీ, వాళ్లు పాలకుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఎంపీలందరిపై ఉమ్మడి అభియోగం మోపలేరని పేర్కొంది. ఇలాంటి అంశాలతో రావడం కోర్టు సమయాన్ని వృథా చేయడమేనంటూ పిటిషనర్‌ను తీవ్రంగా మందలిస్తూ.. పిల్‌ను కొట్టివేసింది.