Pakistan: సీనియర్ పీఎంఎల్-ఎన్ నాయకురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ పంజాబ్ ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పంజాబ్ ప్రావిన్స్‌కు తొలి మహిళా సీఎంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. పంజాబ్‌కు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. తన ప్రమాణ స్వీకారం రాష్ట్రంలోని ప్రతి మహిళకూ గర్వకారణమేనని, మహిళా నాయకత్వ సంప్రదాయం ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నానని మరియం తెలిపారు.
పంజాబ్ అసెంబ్లీలో మెజారిటీ దక్కించుకోవడానికి 187 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే మరియం నవాజ్‌కు 220 ఓట్లు లభించాయి. ఎస్ఐసీకి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతు ఉంది. పీఎంఎల్-ఎన్‌కు చెందిన 137 మంది సభ్యులతో పాటు 20 మందికి పైగా స్వతంత్రులు ఇతర చిన్న పార్టీల మద్దతుతో మరియం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరియం నవాజ్ తండ్రి దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 50 ఏళ్ల మరియం పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ సీనియర్ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు.