Paris, drunken teenagers who slept on top of the Eiffel Tower
Eiffel Tower: మద్యం తాగిన ఇద్దరు అమెరికా టూరిస్టులు ప్రపంచ ప్రఖ్యాత ప్యారిస్‌లోని ఈఫిల్(Eiffel Tower) టవర్పైకెక్కి రచ్చ చేశారు. అనుమతి లేని ప్రదేశం చేరుకొని ఒక రాత్రంతా నిద్ర పోయారు. ఉదయాన్నే భద్రతా సిబ్బంది గమనించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టికెట్లు కొని టవర్‌పైకి ఎక్కారు. టవర్ మూసివేత సమయం అవడంతో భద్రతా సిబ్బంది పర్యాటకులను కిందికి దింపివేశారు. అయితే వీరు సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి పర్యాటకులకు అనుమతి లేని టవర్ ప్రాంతానికి చేరుకొన్నారు. మద్యం మత్తులో అక్కడే రాత్రంతా పడుకున్నారు.
పర్యాటకుల(Tourists) కోసం ప్రతి రోజు ఉదయం 9 గంటలకు టవర్‌ను తెరుస్తారు. దీనికన్నా ముందే పారిశుధ్య సిబ్బంది, భద్రతా సిబ్బంది టవర్‌పైకి ఎక్కుతారు. ఈ క్రమంలో వీరు పడుకున్న దృశ్యాన్ని చూసి భద్రతా సిబ్బంది షాకయ్యారు. వెంటనే పైఅధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఫైర్‌పైటర్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతం నుంచి వారిని జాగ్రత్తగా కిందికి దించినట్లు ఈఫిల్ టవర్ ఆపరేట్ సంస్థ సెటె వెల్లడించింది. అనంతరం వారిని ప్యారిస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈఫిల్ టవర్‌ను కూల్చివేసేందుకు బాంబు అమర్చామంటూ ఒక రోజు ముందే దుండగులు ఫోన్ చేయడంతో ఆ దిశగా వీరిని విచారణ చేశారు.