3D Printed Temple: ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ టెంపుల్ నిర్మాణం.. అదెక్కడో కాదు మనదగ్గరే
ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటెడ్(3D Printed) పద్ధతిలో ఆలయాన్ని(Temple) నిర్మిస్తున్నారు. అది కూడా ఎక్కడో కాదు మన తెలంగాణలోనే.. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రాటెక్(Apsuja Infratech) ఈ టెంపుల్ పనులు చేపట్టింది.
3D Printed Temple: ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటెడ్(3D Printed) పద్ధతిలో ఆలయాన్ని(Temple) నిర్మిస్తున్నారు. అది కూడా ఎక్కడో కాదు మన తెలంగాణలోనే.. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రాటెక్(Apsuja Infratech) ఈ టెంపుల్ పనులు చేపట్టింది. సిద్దిపేట(Siddipet)లోని చర్విత మేడోస్( Charvita Meadows)లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్(impliforge Creations)తో కలిసి అప్సుజా ఇన్ఫ్రాటెక్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన నమూనాలను తాజాగా విడుదల చేసింది. ఈ ఆలయంలో మొత్తం మూడు గర్భాలయాలు ఉన్నాయి. మోదక్ ఆకారం(Modak shape)లో గణేశుడు(Ganesha), దీర్ఘచతురస్రాకార గర్భగుడిలో శివుడు(Lord shiva), పార్వతీ దేవి కోసం పద్మ ఆకారంలో గర్భగుడిని నిర్మిస్తున్నారు.
సింపుల్ఫోర్ట్ క్రియేషన్స్ దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, సాఫ్ట్వేర్ సాయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఒక ప్రార్థనా మందిరం ఇంత పెద్ద ఎత్తున 3డి ప్రింట్ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అది మన తెలంగాణలో కావడం గర్వకారణం. సిద్దిపేట జిల్లా బూరుగుపల్లిలోని గేటెడ్ విల్లా సంఘం చర్విత మెడోస్‌లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అంతకుముందు భారతదేశపు మొట్టమొదటి 3డి ప్రింటెడ్ బ్రిడ్జ్ ప్రోటోటైప్ కూడా చార్వితా మెడోస్‌లో ఆవిష్కరించబడింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ 3డి ప్రింటెడ్ టెంపుల్ ప్రాజెక్ట్ అంతర్జాతీయ ఖ్యాతిని పొందుతోంది. ఈ ఆలయ నిర్మాణం సింప్లిఫోర్జ్ అభివృద్ధి చేసిన రోబోటిక్ ఆర్మ్ సిస్టమ్ సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పనుంది.
3డి ప్రింటెడ్ ఆలయాన్ని నిర్మించడంలో నిర్మాణ బృందం అనేక సవాళ్లను ఎదుర్కొంది. అప్సుజా ఇన్ఫ్రాటెక్ ఎండీ హరికృష్ణ జడ్పీపల్లి మాట్లాడుతూ.. త్రీడీ ప్రింటెడ్ పద్ధతిలో అద్భుతమైన ఆర్కిటెక్చర్, గోపురాల నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురైనా, ప్రత్యేకమైన డిజైన్ పద్ధతులు, కచ్చితమైన అధ్యయనంతో వాటిని అధిగమించామన్నారు. శివాలయం, మోదకం నిర్మాణం పూర్తయిందని, ప్రస్తుతం పద్మాకారం రెండో విడతలో గర్భగుడి, ఎత్తైన గోపురాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.