తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఈ రోజు అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించారు. తాను జాతీయ పార్టీ పెట్టాలని అనుకోవడం లో తప్పేముందని ప్రశ్నించిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనులు రాష్ట్రానికి సమస్యలు తెచ్చిపెడుతున్నాయని వాపోయారు. కాగా… తాజాగా.. కేసీఆర్ కామెంట్స్ పై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.
కేసీఆర్ జాతీయ పార్టీ పెడతామనటం ఈ దశాబ్దంలో పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. తెలంగాణను ఉద్దరించమని రెండుసార్లు గెలిపిస్తే ఏం చేశారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ నాలుగోవిడత పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్‌లోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను ఉద్దరించమని రెండు సార్లు గెలిపిస్తే… పాలన చేతగాక జాతీయ పార్టీ పెడతానంటున్నారని.. అసలు 17 సీట్లలో కేసీఆర్‌కు వచ్చింది 9 సీట్లే… వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అన్ని పార్టీలు ఏకమైనా… నరేంద్ర మోదీని ఏం చేయలేరని.. ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టే అవసరం మాకు లేదు కానీ కేసీఆర్ అవినీతికి మాత్రం మీటర్లు పెడతా అని అన్నారు కిషన్ రెడ్డి.
వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఆకాంక్షించారు. కేసీఆర్ ఇంకా ఉంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. ట్రాన్స్‌కో, జెన్కోలకు రూ.40 వేల కోట్లు నష్టాలు వచ్చాయని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
కేసీఆర్‌ను మించిన అరచకవాది, నియంతృత్వవాది ఇంకొకరు లేరని.. వచ్చే ఎన్నికల్లో భాజపా వందశాతం సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే కేసీఆర్ విష, అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. ప్రగతిభవన్ నుంచి ప్రజలు తరిమికొట్టే పరిస్థితి రాబోతుందన్నారు. 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.