JGL: పండుగల కారణంగా వచ్చిన సెలవుల తర్వాత జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నేటి నుంచి క్రయవిక్రయాలు మళ్లీ ప్రారంభం కానున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అమావాస్య, ఉగాది, రంజాన్, ఆదివారం నేపథ్యంలో మార్కెట్ మూసివేయగా.. నేటి నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగనున్నాయని వెల్లడించారు. రైతులు, వ్యాపారులు గమనించాలన్నారు.
MBNR: నవాబ్‌పేట్ మండల కేంద్రంలోని బాలాజీ మార్కెట్ యార్డ్‌కు 1998 క్వింటాళ్ల వేరుశనగ వచ్చినట్లు కార్యదర్శి రమేష్ తెలిపారు. వేరుశనగ క్వింటాల్ గరిష్ట ధర ₹8,010 పలకగా, కనిష్టంగా ₹7,590 పలికింది. అయితే, చింతపండు గరిష్టంగా ₹9,890 ధర పలకడం విశేషం. వేరుశనగతో పోలిస్తే చింతపండుకే అధిక ధర రావడంతో రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
MDCL: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. గత మూడు వారాల్లోనే 20 వేలకుపైగా కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటించని వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు.
NLG: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రాక్టికల్ తరగతులు నల్గొండ ఎన్జీ కాలేజీలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఐదో సెమిస్టర్ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, బొటనీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ తరగతులు ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయన్నారు.
NRPT: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఊట్కూరు మండలంలో పోలీసులు ముందస్తు అరెస్టులు కొనసాగించారు. రామచంద్రరావు పిలుపు మేరకు రాజధానికి బయలుదేరే బీజేపీ నాయకులను అర్ధరాత్రి నుంచే ఇళ్ల వద్ద మోహరించి అదుపులోకి తీసుకున్నారు. నాయకులు ఈ చర్యలను ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వం భయంతోనే అక్రమ అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు.
SDPT: చేర్యాల మండలం వెచరేణిలో 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. నాటి పాఠశాల ముచ్చట్లను మిత్రులు గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆ రోజంతా సరదాగా గడిపారు. కొందరు మిత్రులు తమ జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఎంతో కాలం తర్వాత కలిసిన స్నేహితుల నవ్వులతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.
MHBD: కేసముద్రం మండలం అర్పణపల్లిలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు సోమవారం మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసిగా గుర్తించారు. సాయి ఉపాధి నిమిత్తం గ్రామ శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి వలలో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు.
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో సాహితి వేదిక ఏకగ్రీవ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్బంగా గౌరవ అధ్యక్షుడిగా రాథోడ్ భీంరావు, అధ్యక్షుడిగా ముంజం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షులుగా తొడసం కైలాష్, పవార్ వినోద్, ప్రధాన కార్యదర్శిగా జాదవ్ మురళిలను ఎన్నుకున్నారు. అదేవిధంగా సభ్యులను సైతం నియమించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.
KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పంటల కోసం పలు దశల్లో సాగునీటి విడుదల కొనసాగుతోంది. యాసంగి పంటల కోసం సోమవారం 229 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 23 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతుందని, ఎటువంటి ఇన్ ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు యాసంగి పంటల కోసం 0.908 TMCల నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు.
PDPL: మంథని మండలం సూరయ్యపల్లి రైతువేదిక నుంచి తెనుగు గూడెం వరకు, గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి పోచమ్మ దేవాలయం వరకు ఆదివారం రూ.15 లక్షలతో EGS నిధుల కింద సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. సర్పంచ్ ఆర్ల నాగరాజు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రోడ్లను త్వరలో పూర్తి చేస్తామన్నారూ.
WGL: వరంగల్ ఆర్టీసీ రీజియన్‌లో అవుట్ సోర్సింగ్ డ్రైవర్ల నియామకాలపై అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీలు దళారుల ద్వారా అభ్యర్థుల నుంచి రూ.20–50 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ప్రచారం. పర్మినెంట్ ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అధికారులు స్పందించి మోసాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదూరు వర్షకొండ గ్రామాల్లోని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.
NZB: ఉమ్మడి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలప పోలీసులు నిఘా తీవ్రం చేశారు. గత మూడు నెలల్లో NZB, KMR జిల్లాల్లో కలిపి 40కి పైగా పేకాట కేసులు నమోదయ్యాయి. ఈదాడుల్లో 250 మందికి పైగా జూదరులను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి రూ.15 లక్షలకు పైగా నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ముఖ్యంగా ఆర్మూర్, బోధన్,బాన్సువాడ, కామారెడ్డి ప్రాంతాల్లో జోరుగా పేకాట ఆడుతున్నారు.
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో BJP నాయకులకు పోలీసులు నేడు ముందస్తు అరెస్టు చేశారు. BJP తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్తున్న మండల పార్టీ అధ్యక్షుడు బిరాదర్ శంకర్ పాటిల్, శ్రీనివాస్ పాటిల్ తదితరులకు హైదరాబాద్‌కు వెళ్లనివ్వకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువ మోర్చా అధ్యక్షుడు యాదగిరి ముదిరాజ్, బిక్షపతి ఉన్నారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ఈనెల 24లోపు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదని మాజీ MLA, BRS జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తోందని, దీనిపై త్వరలో గవర్నర్‌ను కలుస్తామన్నారు. అవసరమైతే కోర్టు దిక్కరణ కింద మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.