తండ్రి కేసీఆర్ అనారోగ్యంగా ఉండటంతో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోతున్నానని కేటీఆర్ తెలిపారు. తనకు మరో రోజు సమయం కేటాయించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరారు.
KTR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాయపడగా.. యశోద ఆస్పత్రిలో సర్జరీ కూడా జరిగింది. ఆస్పత్రిలో కుమారుడు కేటీఆర్ (KTR), కూతురు కవిత, సంతోష్ రావు ఉన్నారు. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఆ తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు వచ్చారు. ప్రొటెం స్పీకర్గా అక్బర్ ఉండటంతో బీజేపీ సభ్యులు సభకు రాలేదు.
కేటీఆర్ (KTR) కూడా రాలేదు. అందుకు గల కారణం ట్వీట్ చేసి వివరించారు. తండ్రి కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నందున సభకు రాలేకపోతున్నానని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కు కూడా రాలేదని పేర్కొన్నారు. తనతోపాటు కొందరు ఎమ్మెల్యేలు రాలేదని.. మరో రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీకి రిక్వెస్ట్ చేశారు. సభలో మొత్తం 109 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వారు తర్వాత ప్రమాణం చేస్తారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నికైన తర్వాత తమ సభ్యులు ప్రమాణం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.