»Coaching Centers Are Empty In Hyderabad Hopes Of The Unemployed Evaporate
Telangana: హైదరాబాద్‌లో ఖాళీ అవుతోన్న కోచింగ్ సెంటర్లు..నిరుద్యోగుల ఆశలు ఆవిరి!
హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకునేవారంతా తమ తమ ఊళ్ళకు పయనమవుతున్నారు. ఎన్నికలు రావడం, పోటీ పరీక్షలు వాయిదా పడటంతో చాలా మంది ఇప్పటికే కోచింగ్ సెంటర్లను ఖాళీ చేసేశారు.
చదువు పూర్తయ్యాక ఏదోక జాబ్ చేసి సెటిల్ అయిపోవాలని అనుకునేవారు కొందరు ఉంటే మరికొందరు మాత్రం తమకు నచ్చిన ఉద్యోగాన్ని చేస్తూ తమ గోల్‌ను ఫుల్‌ఫిల్ చేసుకుంటుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ప్రభుత్వ రంగ ఉద్యోగాలు పొందేందుకు ఏళ్లతరబడీ కోచింగ్‌లు తీసుకుంటారు. నోటిఫికేషన్ విడుదలయ్యే వరకూ కూడా వాళ్లు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి దీక్షగా ప్రిపేర్ అవుతుంటారు. అలా సర్కార్ కొలువు కోసం కొన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు చాలా మందే ఉన్నారు.
తాజాగా పోటీ పరీక్షల కోసం హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకునేవారు తమ కోచింగ్ సెంటర్లను ఖాళీ చేస్తున్నారు. ఉద్యోగార్థులు నగరాన్ని వీడి పల్లెబాట పడుతున్నారు. తెలంగాణలో పరీక్షలు వాయిదా పడటం, అసెంబ్లీ ఎన్నికలు కూడా రావడంతో మరో నాలుగు నెలల వరకూ ఎటువంటి పోటీ పరీక్షలు జరగవు. అన్ని నెలల పాటు హైదరాబాద్ లోనే ఖాళీగా ఉండగా హాస్టళ్లను ఖాళీ చేసి సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో ఇన్నాళ్ల పాటు కళకళలాడిన స్టడీ సెంటర్లు, హాస్టళ్లు బోసిపోవడం విశేషం.
చాలా మంది నిరుద్యోగులు కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి నెలకు దాదాపుగా రూ.12 వేల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో మళ్లీ నోటిఫికేషన్ రావడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అంత వరకూ ఇక్కడ ఉంటే ఆర్థిక భారం తప్పా మరేమీ ఉండదు. అందుకే ఇప్పటికే చాలా మంది భాగ్యనగరాన్ని వీడారు. ఇక్కడికొచ్చి ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం కంటే ఊర్లో ఉన్న వ్యవసాయ భూమిని సాగు చేసుకోవడం మేలని మరికొందరు అంటున్నారు.
తెలంగాణలో పరీక్షల పేపర్లు లీక్ అవ్వడం, ఆ తర్వాత పోటీ పరీక్షలు వాయిదా పడటం ఉద్యోగ అభ్యర్థుల్లో తీవ్ర అలజడిని రేపింది. కొందరు నిరాశతో ప్రాణాలు కూడా విడిచారు. మరికొందరు ఇతర జాబ్స్ చూసుకున్నారు. గ్రూప్స్ పరీక్షల విషయంలో పేపర్స్ లీక్ అయిన ఘటన నిరుద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. పరీక్షల మీద చాలా మంది ఆశ చచ్చిపోయింది. ఆ తర్వాత మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో పరీక్షలంటేనే నిరుద్యోగుల్లో భయం పట్టుకుంది. అందుకే వాటిపై నమ్మకం వదిలి సొంతూరిబాట పడుతున్నామని నిరుద్యోగార్థులు చెబుతున్నారు.