CM KCR Participated In Nalla pochama Purnahiti At Dr.B.R.Ambedkar Telangana Secretariat
Dr.B.R.Ambedkar Telangana Secretariat: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నూతనంగా నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకలు జరిగాయి. ఎడమొహం పెడమోహంగా ఉండే సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పూజ మీద కూర్చొన్నారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతి కుమారి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇటు సచివాలయం సమీపంలో మసీదు, చర్చి కూడా ప్రారంభించారు. సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2300 గజాల స్థలంలో ఆలయం నిర్మాణం చేపట్టారు. శివాలయం, నల్ల పోచమ్మ గుడి, హనుమాన్, గణపతి ఆలయాలు ఉన్నాయి. దేవాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం యాగం నిర్వహించారు. మత పెద్దల సమక్షంలో మసీదు, చర్చీలను కూడా ప్రారంభించారు. మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో భాగంగా కేక్ కట్ చేశారు. మసీదును ప్రారంభించిన తర్వాత.. నమాజ్ చేశారు. పూజ కార్యక్రమాలు తర్వాత కొత్త సచివాలయాన్ని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పరిశీలించారు.
పాత సచివాలయాన్ని కూలగొట్టి.. కొత్త సచివాలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవానికి గవర్నర్ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించలేదు. అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ సమయంలోనూ ఇన్వైట్ చేయలేదు. ఈ రోజు మాత్రం పిలిచారు. తెలంగాణ మంత్రివర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డిని తీసుకున్నారు. ప్రమాణం చేసిన తర్వాత 20 నిమిషాల పాటు గవర్నర్తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ సమయంలో పిలువగా.. ఆమె వచ్చారు. చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కలిసి కనిపించారు.