Navneet kaur : బీజేపీ ప్రముఖ ప్రచారకర్తల్లో ఒకరైన ఎంపీ నవనీత్ కౌర్‌పై(MP navneet kaur) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అక్కడ రోడ్ షో నిర్వహించారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థిని డీకే అరుణకు మద్దతుగా ఆమె ఈ రోడ్‌షోలో పాల్గొని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన దాంట్లో కొన్ని అభ్యంతరకరమైన మాటలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ గుర్తించింది. దీంతో ఈ విషయమై షాద్‌నగర్‌లో కేసు నమోదు చేసింది.
అమరావతి ఎంపీగా(MP ) ఉన్న నవనీత్ కౌర్(navneet kaur) ఈ రోడ్ షోలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్థాన్‌కు ఓటేసినట్లే అని విమర్శించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అభ్యంతరం తెలిపింది. ఇలాంటి విమర్శలు చేయడం సమర్థనీయం కాదని చెప్పింది. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసింది. ఆమెతో పాటుగా ఈ రోడ్ షో కోసం పర్మిషన్ తీసుకున్న వారిపై కూడా కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని షాద్ నగర్ పోలీసులు సైతం ధ్రువీకరించారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అభ్యర్థులు ఇలా ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీలు లేదని ఈసీ ముందుగానే ప్రకటించింది. కచ్చితంగా అంతా ఎన్నికల నియమావళికి లోబడే ప్రచారం చేయాలని ఈసీ గతంలోనే సూచించింది. అయితే అక్కడక్కడా ఇలాంటి ఘటనలు మాత్రం వెలుగు చూస్తున్నాయి.