KTR: బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. మార్చి 1 నుండి చలో మేడిగడ్డ
మార్చి 1న చలో మేడిగడ్డ కార్యక్రమానికి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరనున్నట్లు ఆయన ప్రకటించారు.
KTR: బీఆర్ఎస్(BRS) పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలిపారు. మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు. 150-200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు కాళేశ్వరం సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తద్వారా చాలా మంది ఆరోపణలకు చెక్ పెడుతామన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని, అందుకోసమే మేడిగడ్డకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం గొప్పతనం ఏంటో విడుతల వారిగా చూపిస్తామన్నారు. ఫిబ్రవరి 13న అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి మేడిగడ్డను సందర్శించారు. ఎమ్మెల్యేలతో కలిసి ప్రాజేక్ట్లో పిల్లర్లు కుంగిపోవడం, గోడలు బీటలు వారడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజేక్ట్ కట్టడంలో నాణ్యతాప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.