Amith Shah: బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేతల కండువా వేరు.. ఎన్నికలు పూర్తయిన తర్వాత వారే కలుస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు వేసినట్టేనని తెలిపారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళతారని చెప్పారు. దీంతో అభివృద్ధికి అవకాశం ఉండదని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
పదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని అమిత్ షా (Amith Shah) విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని నిర్మించలేదన్నారు. మిగులు ఆదాయం గల రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. రూ.లక్ష రుణ మాఫీ చేయలేదని.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టలేదని వివరించారు. భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లీజు వేలం, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కుంభకోణం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా (Amith Shah) స్పష్టంచేశారు. ముస్లిం రిజర్వేషన్లను తీసివేస్తామని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇక్కడి ప్రజల ఓటు దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.