తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ నియోజవర్గ టికెట్ దక్కకపోవడం వల్లనే నిరాశ చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
BJP: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ నియోజవర్గ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. భావోద్యేగానికి లోనయ్యారు. బీజీపీ తనకు అన్యాయం చేసిందన్నారు. పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని, పార్టీని బలోపేతం చేసిన తర్వాత తనను దూరం పెట్టారని వాపోయాడు.
ఇలాంటి నేపథ్యంలో ప్రజాబలం ఉన్న నాయకులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 ఏళ్లుగా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని సమస్యలపై పోరాడానని గుర్తు చేశారు. బీజేపీలో ఎన్ని అవమానాలు జరిగినా హైకమాండ్‌కు ఫిర్యాదు చేయలేదని అన్నారు. యువతకు, ప్రతిభకు ఇక్కడ ఆదరణ లేదన్నారు. ప్రశ్నించే గొంతులను కోసేస్తున్నారని వాపోయారు. ఇలాంటి క్రమంలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 7,8 స్ధానాలు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. తనని పార్టీ నుంచి పంపించే కుట్ర జరుగుతోందని…బీజేపీ కోసం ఇన్నాళ్లు కష్టపడ్డానని చెప్పారు. కానీ తనని ఏ కార్యక్రమానికి కూడా పిలవడం లేదన్నారు. తనకు ఎన్ని అవమానాలు జరిగినా పార్టీ గీతను దాటలేదని గుర్తుచేశారు.
తనకు మైక్ ఇవ్వాలంటే పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తనకు మైక్ ఇస్తే భయపడాల్సింది బీఆర్ఎస్ నాయకులు. కానీ సొంత పార్టీ నాయకులే మైక్ లాక్కుంటున్నారని వాపోయారు. అసలు తాను చేసిన తప్పు ఏంటని ప్రశ్నించారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలని, ఉన్నత ఉద్యోగాలను వదిలేసి 2013లో వరంగల్‌కు వచ్చి బీజేపీలో చేరానని అన్నారు. 11 ఏళ్ల ప్రస్థానంలో పార్టీనే కుటుంబంగా భావించానని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో కష్టాలు, నష్టాలు అవహేళనలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు.