»Bjp Leader Arrested For Orchestrating Fake Assassination Attempt For Publicity
Self Attack : తన మీద తానే మర్డర్ ప్లాన్… అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత
గన్ మ్యాన్ని ఇస్తారన్న ఉద్దేశంతో హత్యాయత్నం డ్రామాకి పాల్పడిన బీజేపీ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని చదివేయండి.
Self Attack For Security: హైదరాబాద్కు చెందిన బీజేపీ నాయకుడు భాస్కర్ గౌడ్(Bhaskar goud) పై కత్తులతో దాడి జరిగిన కేసు దర్యాప్తులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తన భద్రత కోసం గన్ మ్యాన్లను ఇస్తారన్న ఉద్దేశంతో తనపై తానే దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కొద్ది రోజుల క్రితమే రాజకీయాల్లోకి వచ్చిన భాస్కర్ బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. గతంలో అతనిపై క్రిమినల్ కేసులూ ఉన్నాయి.
తనకు ప్రాణ హాని ఉందని, గన్ మ్యాన్లను ఇవ్వమని కోరడానికి గాను తనపై తనే హత్యాయత్నం డ్రామాను ఆడాడు. ఈ నేపథ్యంలోనే తనపై హత్యా యత్నం జరిగిందంటూ ఉప్పల్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారిస్తున్న పోలీసులు అసలు విషయాన్ని పసిగట్టారు. నిందితుడు భాస్కర్గౌడ్తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు.
బీజేపీ నాయకుడిగా చలామణీ అవుతున్న భాస్కర్ గౌడ్ హైదరాబాద్లోని బోడుప్పల్లో నివసిస్తున్నాడు. పలుకుబడి కోసం, గుర్తింపు కోసం గన్ మ్యాన్లు తన చుట్టూ ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. అలా గన్ మ్యాన్లు ఉంటే అంతా తనను గుర్తిస్తారని తలిచాడు. దీంతో తనపై తానే దాడికి ప్లాన్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 24న తనపై దాడి చేయాల్సిందిగా ఓ కిరాయి మూకతో రూ.2.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఆ రోజు అతడిపై దాడి జరిగింది. ఆ కేసును విచారిస్తున్న పోలీసులు ఈ విషయాలను తెలుసుకుని షాకయ్యారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని డీసీపీ పద్మజ తెలిపారు.