World Cup : ఎదురులేని భారత్.. నెదర్లాండ్స్ పై ఘన విజయం
వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ గెలుపు జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ లీగ్‌లో వరుసగా ఎనిమిది మ్యాచులు గెలిచిన టీమిండియా ఆదివారం పసికూన నెదర్లాండ్స్ పై ఘన విజయం సాధించింది
వన్డే ప్రపంచకప్(World Cup)లో భారత్ జైత్రయాత్రను కొనసాగించింది. గ్రూప్ స్టేజ్‌లో భారత్‌ను ఓడించే సత్తా జట్టుకు రాలేదు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిదింటిలో గెలిచి అపజయమే లేని జట్టుగా నిలిచింది. బెంగళూరు (Bangalore)లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా.. 160 పరుగుల భారీ తేడాతో గెలిచింది.రోహిత్(Rohit)సేన నిర్దేశించిన 411 పరుగుల భారీ ఛేదనలో డచ్ జట్టు.. 47.5 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ బ్యాటర్లలో యంగ్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీలతో రాణించారు.
కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 102 పరుగులు చేయగా, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) 94 బంతుల్లో 128 రన్స్ చేసి సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్ శర్మ 61, శుభమన్ గిల్ 51, విరాట్ కోహ్లీ 51 హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 410 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 411 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ (Netherlands) 47.5 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో తేజ నిడమనూరు 54 హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో నెదర్లాండ్స్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో బుమ్రా(Bumrah), సిరాజ్, కుల్దీప్, జడేజా తలా రెండు వికెట్లు తీశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ సాధించారు.