స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలయ్యాయి. అయితే హాజరైన కొద్ది మంది బంధుమిత్రులు, ప్రముఖులు నూతన దంపతులకు ఊహించని రీతిలో బహుమతులు ఇచ్చారంట. పెళ్లి సందర్భంగా అతిథులు కొత్త జంటకు ఖరీదైన ఫ్లాట్, వాచ్ లు, వాహనాలు, ఆభరణాలు ఇచ్చారని సమాచారం. సినీనటులు, క్రికెటర్లు, పలువురు ప్రముఖులు కొత్త జంటకు ఇచ్చిన బహుమతుల గురించి తెలుసుకుంటే వావ్ అనాల్సిందే..
బాలీవుడ్ నటుడు, అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి తన అల్లుడికి మామూలు బహుమతి ఇవ్వలేదట. ముంబైలోనే అత్యంత విలాసవంతమైన ప్లాట్ ను కానుకగా ఇచ్చారట. దాని విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ.50 కోట్లు అని తెలుస్తోంది. ఇక సునీల్ కు అత్యంత సన్నిహితుడు హీరో సల్మాన్ ఖాన్ కొత్త జంటకు రూ.1.64 కోట్లు విలువ చేసే ఆడీ కారు బహుమతిగా ఇచ్చారని బాలీవుడ్ లో వార్త చక్కర్లు కొడుతోంది. అతియాకు నటుడు జాకీ ష్రాఫ్ రూ.30 లక్షల విలువ చేసే వాచ్ ను ఇచ్చాడని, అర్జున్ కపూర్ వజ్రాల హారం ఇచ్చారని ముంబైలో వినిపిస్తున్న మాటలు.
ఇక రాహుల్ కు మన క్రికెటర్లు భారీగానే కానుకలు ఇచ్చారంట. తన మిత్రుడు రాహుల్ కు మన పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ ఏకంగా బీఎమ్ డబ్ల్యూ కారు ఇచ్చాడని సమాచారం. ధోనీ ఒక ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు మరికొందరు ఈ కొత్త జంటకు భారీ కానుకలు ఇచ్చారని తెలుస్తున్నది. వివాహం కొద్దిమంది సమక్షంలో జరపగా.. ప్రముఖుల కోసం ముంబైలో త్వరలోనే భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సునీల్ శెట్టి తెలిపారు.