• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆక‌ట్టుకుంటున్న కేఎఫ్‌సీ సైకత శిల్పం

VSP: ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ KFC చికెన్ బకెట్ సైకత శిల్పం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. నగరంలో కేఎఫ్‌సీ 14వ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ రెండు రోజుల పాటు శ్రమించి ఈ కళాఖండాన్ని రూపొందించారు. ఈ శిల్పం వద్ద పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

March 24, 2026 / 05:55 PM IST

‘విపత్తు నిర్వహణలో సమన్వయం ముఖ్యం’

KMR: కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ విక్టర్ ఆధ్వర్యంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ టేబుల్‌టాప్ వ్యాయామం నిర్వహించింది. వరదల వంటి విపత్తుల సమయంలో ముందస్తు సిద్ధత, శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన స్పందనపై అధికారులు చర్చించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి పక్కా ప్రణాళికలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

March 24, 2026 / 05:53 PM IST

యాదగిరిగుట్ట బార్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం!

BHNG: బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సూదగాని శ్రీహరి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రమేశ్, సంతోష్, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, సహాయ కార్యదర్శిగా గణేశ్, క్రీడా కార్యదర్శిగా రేణుక ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కనకరాజు, నవితలను సభ్యులు ఎన్నుకున్నారు.

March 24, 2026 / 05:52 PM IST

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

MDK: భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్లు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లో గూగుల్ మీట్ ద్వారా భూభారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఓటర్ జాబితా తయారీపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 24, 2026 / 05:50 PM IST

మేడారంలో వనదేవతల కానుకల లెక్కింపు

MLG: మేడారం సమ్మక్క-సారలమ్మల హుండీ కానుకల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. మహాజాతర అనంతరం భక్తులు భారీగా తరలివచ్చి సమర్పించిన కానుకలతో గద్దెలపై ఉన్న సుమారు 30 హుండీలు నిండాయి. జాతర ఈఓ వీరాస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

March 24, 2026 / 05:47 PM IST

గుండ్లకొండలో సుంకలమ్మ దేవి ఉత్సవాలు

KRNL: దేవనకొండ(మం) గుండ్లకొండలో జరిగిన శ్రీ సుంకలమ్మ దేవి ఊరు దేవర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మండల కన్వీనర్లు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై ఉత్సవాలను ఘనంగా జరిపారు.

March 24, 2026 / 05:47 PM IST

‘రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం’

KDP: రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ నాగూరు వీరభద్రుడు పేర్కొన్నారు. మంగళవారం సిద్ధవటం మండలం మాధవరం-1లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరభద్రుడు మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.

March 24, 2026 / 05:47 PM IST

తాడేపల్లిగూడెంలో ‘రైతన్న మీకోసం’

W.G: తాడేపల్లిగూడెం(మం) కొమ్ముగూడెం, పట్టింపాలెం, బంగారుగూడెం గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు వారి ఖాతాల్లో జమయ్యాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు, అవసరాలు తెలుసుకుంటూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

March 24, 2026 / 05:46 PM IST

కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

E.G: కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ డివిజన్ నారాయణపురం వాంబే గృహాల వద్ద నగర పాలక సంస్థ చేపట్టిన ఆక్రమణల తొలగింపుతో ఉపాధి కోల్పోయిన 12 మందికి వారి కుటుంబ అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే.. తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్ధిక సహాయం అందించారు. కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

March 24, 2026 / 05:46 PM IST

మైనర్ బాలికపై హత్యాచారం.. 20 ఏళ్లు కారాగార శిక్ష

WNP: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడుపై నేరం రుజువు కావడంతో వనపర్తి జిల్లా న్యాయమూర్తి నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 30 వేలు జరిమానా విధించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. గోపాలపేట మండలం లక్ష్మీ తండాకు చెందిన మైనర్ బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కోర్టులో ప్రవేశ పెట్టారు.

March 24, 2026 / 05:46 PM IST

ఉత్తరాంధ్ర.. ఉక్కు ఆంధ్రాగా: సీఎం చంద్రబాబు

AP: అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఉత్తరాంధ్రకు దిక్సూచి అవుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ఇకపై ‘ఉక్కు ఆంధ్రా’గా మారుతుందని పేర్కొన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉక్కు రంగంలో ఏపీ దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని తెలిపారు. కబ్జాలు, కూల్చివేతలు, భయంతో అల్లాడిన ఉత్తరాంధ్రలో నేడు ఆనందాన్ని, భరోసాను తీసుకొచ్చామన్నారు.

March 24, 2026 / 05:45 PM IST

తెనాలి అభివృద్ధిపై మంత్రి సమావేశం

GNTR: తెనాలి పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పట్టణాన్ని రాష్ట్రంలో టాప్-5 స్థానంలో నిలిపేలా కార్యాచరణ రూపొందించాలని, పన్నుల వసూళ్లు 95 శాతం సాధించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ.9 కోట్ల నిధులను త్వరితగతిన రాబట్టాలని సూచించారు.

March 24, 2026 / 05:45 PM IST

‘పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి’

ADB: రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ జిల్లాధ్యక్షుడు, కౌన్సిలర్ సాయిచరణ్ గౌడ్ హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా తాజా రాజకీయ అంశాలు, అభివృద్ధి, పలు అంశాలను నరేందర్ రెడ్డితో చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

March 24, 2026 / 05:44 PM IST

సోలార్ విద్యుత్ యూనిట్ ప్రారంభం

ELR: దెందులూరు నియోజకవర్గంలో SC, ST కుటుంబాలకు 100% సబ్సిడీతో 2KW సామర్థ్యం గల సోలార్ విద్యుత్ యూనిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లబ్ధిదారుని ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తొలి సోలార్ విద్యుత్ యూనిట్‌ను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. SC, ST సంక్షేమానికి, అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు.

March 24, 2026 / 05:44 PM IST

‘డ్వాక్రా మహిళలకు కలెక్టర్ సహకరించాలి’

JN: కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద టీ స్టాల్, మిల్క్ పార్లర్ ఏర్పాటు చేసుకున్న పేద డ్వాక్రా మహిళలకు కలెక్టర్ సహకరించాలని CPM నేత మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. గత కలెక్టర్ అనుమతితోనే వారు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారని, ప్రస్తుతం ఎలాంటి వేధింపులు లేకుండా అదే స్థలంలో దుకాణాలు నడుపుకునేలా చూడాలని కోరారు.

March 24, 2026 / 05:44 PM IST