తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల ఎమ్మెల్యేలను మార్చాలని అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను అలా అనలేదని మంత్రి క్లారిటీ ఇస్తున్నారు. మరో 20 మంది ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేయాలని చెప్పానని తెలిపారు. తన మాటలను మార్చారని పేర్కొన్నారు. కష్టపడాలని చెబితే.. మార్చాలని అన్నట్టు వక్రీకరించారని మండిపడ్డారు. తాను అలా అనలేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 80 సీట్లు పక్కగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. మరో 20 నుంచి 25 సీట్లలో గెలుపు కోసం కష్టపడాలని తెలిపారు. ఇదే విషయాన్ని తాను చెప్పానని, కానీ దానిని కొందరు మార్చారని తెలిపారు.
‘సీఎం కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉంది. పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంది. ఆ ఎమ్మెల్యేలను మారిస్తేనే బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది. లేదంటే 90 సీట్లకే పరిమితం అవుతుంది. నా సర్వే ఎప్పుడూ తప్పు కాలేదు’ అని ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల కామెంట్స్ చేశారు. అవీ చర్చనీయాంశం అయ్యాయి. సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ ఎందుకు చేశారో అర్థం కాలేదు. ఇంతలోనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తాను అలా అనలేదని, మరింత కష్టపడాలని మాత్రమే అన్నానని చెబుతున్నారు. ఇంతకుముందు మంత్రి ఎర్రబెల్లి కామెంట్ చేసిన ఆ 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ మాత్రం జరుగుతుంది. బీఆర్ఎస్లో విభేదాలు చాలా తక్కువ.. కానీ ఇటీవల హైదరాబాద్ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డి తీరుకు వ్యతిరేకంగా సమావేశం అయ్యారు. దాంతో ఈ పార్టీలో కూడా విభేదాలు బయట పడుతున్నాయి.
ఇదివరకు జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తామని హామీనిచ్చారు. ఆ మేరకు పార్టీ నిర్ణయం తీసుకోనుంది. మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్స్ వ్యక్తిగతం.. ఇంతలోనే ఆయన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఖమ్మం సభ జరగనుండగానే ఆయన తాను అలా అనలేదని చెప్పేశారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద జరిగే సభకు దాదాపు 5 లక్షల మంది జనం తరలి రానున్నారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్, ఇతర ముఖ్య నేతలు వేదికపై ఆశీనులు అవుతారు.