భార్య పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో తన భర్త కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కారుకు మంటలు వ్యాపించడంతో కారులోనే భార్య, భర్త ఇద్దరూ కాలి బూడిదయ్యారు. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూర్ లో చోటు చేసుకుంది. 35 ఏళ్ల ప్రిజిత్.. తన భార్య 26 ఏళ్ల రీషాకు ఉదయం లేబర్ పెయిన్స్ రావడంతో వెంటనే తనను తీసుకొని కారులో జిల్లా ఆసుపత్రికి బయలుదేరాడు. 2020 మోడల్ మారుతి ఎస్ ప్రెస్సో కారు అది. ఆ కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. నలుగురు వెనుక సీటులో కూర్చోగా, ముందు తన భార్య కూర్చుంది. ప్రిజిత్ కారు నడుపుతున్నాడు. కారులో ఒక్కసారిగా మంటలు అంటుకోగానే వెనుక కూర్చున్న వారి కారు డోర్ ఓపెన్ కావడంతో వాళ్లు ప్రాణాలు కాపాడుకోగలిగారు. ముందు కూర్చున్న రీషా కారు డోర్ ఓపెన్ కాకపోవడంతో తను, ప్రిజిత్ ఇద్దరూ మంటల్లో కాలిపోయారు.
ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే ప్రిజిత్, రీషా ఇద్దరూ కారులో చనిపోయి ఉన్నారు. కారుకు మంటలు అంటుకోగానే వాళ్లను కాపాడేందుకు అక్కడ ఉన్న స్థానికులు ప్రయత్నించారు కానీ.. వాళ్లను కాపాడలేకపోయారు. కారు ఎక్కడ పేలుతుందో అని చాలామంది కారు దగ్గరికి వెళ్లడానికి కూడా సాహసించలేదు. కారు ముందు భాగానికే తొలుత మంటలు అంటుకోవడంతో వాళ్లను కాపాడలేకపోయామని వెనుక సీటులో కూర్చున్న ఆ జంట కుటుంబ సభ్యులు వాపోయారు. అసలు కారుకు ఎందుకు మంటలు అంటుకున్నాయి అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో ఆ జంట చేసిన ఆర్తనాదాలు చూసి నెటిజన్లు చలించిపోయారు. పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్తూ ఇంత ఘోరం జరగడం ఏంటి అంటూ స్థానికులు కంటతడి పెట్టారు.