Weather: Low pressure in Bay of Bengal.. Rains in these districts
Weather: తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య దిశగా కదులుతున్న అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.
ఏపీలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.