ఎక్కడికక్కడ బీజేపీని దెబ్బ తీసేందుకు ఆయా రాష్ట్రాల్లో పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన బీజేపీపై శివసేన పార్టీ ఉద్దవ్ ఠాక్రే వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉంది. బీజేపీని ఎలాగైనా దెబ్బ తీయాలని ఉన్న మార్గాలన్నింటిని వినియోగించుకుంటోంది. ఈ సందర్భంగా సరికొత్త రాజకీయాలకు తెర లేపింది. దేశంలోనే అతి పెద్ద మహానగర పాలక సంస్థగా గుర్తింపు పొందిన ముంబై కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే రానున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉద్దవ్ ఠాక్రే సరికొత్త పొత్తులు చేసుకుంటున్నారు.
తాజాగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ తో చేతులు కలిపారు. త్వరలో జరుగనున్న ముంబై ఎన్నికల్లో చైర్మన్ పీఠం సొంతం చేసుకోవడానికి వేసిన వ్యూహంలో భాగమే ఈ పొత్తు. రానున్న రోజుల్లో తమ కూటమి ప్రజాపక్షమని ఉద్దవ్, ప్రకాశ్ అంబేడ్కర్ ప్రకటించారు. మహారాష్ట్రలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కు అభిమానులు అధికంగా ఉంటారు. అంబేడ్కర్ ను దేవుడిగా భావిస్తారు. మరి అలాంటి వ్యక్తి మనుమడితో జత కట్టడంతో తమకు కలిసొస్తుందని ఉద్దవ్ ఠాక్రే భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్దవ్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలోని చాలా మంది ప్రజలు మేం కలిసి రావాలని కోరుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నా. ప్రకాశ్ అంబేడ్కర్ తో కలిసి కూటమిని ఏర్పాటు చేసేందుకు ఇక్కడ కలవడం శుభసూచకం. మా తాత, ప్రకాశ్ తాత ఇద్దరూ సహచరులు, అప్పట్లో సామాజిక సమస్యలపై పోరాడారు. ఠాక్రే, అంబేడ్కర్ లకు చెరిగిపోని చరిత్ర ఉందని, ఇప్పుడు వారి భవిష్యత్ తరాలుగా మేం కూడా దేశంలోని ప్రస్తుత సమస్యలపై పోరాడేందుకు సిద్ధం. ఈ కూటమిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా చేతులు కలుపుతారని ఆశిస్తున్నా’ అని ప్రకటించారు.