కరోనా (Corona) వల్ల ప్రపంచం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ (LockDown) వచ్చి ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. చాలా మంది ప్రాణాలు వదిలారు. అంతకుముందు కేరళ (Kerala)లో నిపా వైరస్ చాలా మందిని పొట్టనబెట్టుకుంది. తాజాగా ఇప్పుడు తమిళనాడు (Tamilnadu)లో కొత్త రకం వైరస్ దాపురించింది. కరోనా ఇక మనల్ని ఏం చేయలేదులే అని అనుకుంటున్న తరుణంలో ఈ కొత్త వైరస్ అందర్నీ భయపెడుతోంది.
తమిళనాడులో విజృంభిస్తోన్న ఆ వైరస్ను ‘ఫ్లూ వైరస్’ (Flue virus)గా పిలుస్తున్నారు. ఆ వైరస్ ప్రభావంతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో తమిళనాడు సర్కార్ అలర్ట్ అయ్యింది. మాస్క్ లేకుండా ఎవ్వరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా కోయంబత్తూర్ జిల్లాలో ఈ తరహా కేసులు ఎక్కువగా ఉండటంతో ఆ జిల్లా వ్యాప్తంగా అధికారులు అలెర్ట్ జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోఈ ఫ్లూ వైరస్ కేసులు నమోదవుతుండటంతో కొంత ఆందోళన కలిగిస్తోంది.
వైరస్ లక్షణాలు ఇవే:
జ్వరం వచ్చిన తర్వాత ఒళ్లునొప్పులు మొదలవుతాయి. ఆ రెండు లక్షణాలు మలేరియా, టైఫాయిడ్ అనుకుని ఆస్పత్రికి వెళ్తారు. కానీ ఆ తర్వాతే కొత్త లక్షణాలు ప్రారంభమవుతాయి. ముక్కులో నుంచి నీరు కారడం, తలనొప్పి రావడం వంటివి జరుగుతాయి. దీంతో వాటిని ఈ ‘ఫ్లూ వైరస్’ లక్షణాలుగా వైద్యులు నిర్దారించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని అధికారులు వెల్లడించారు.