Tamil Nadu: మహా అయితే ఓ నిమ్మకాయ ధర రూ.10లు ఉంటుంది. కానీ ఓ నిమ్మకాయ ధర రూ.35 వేలు. మీరు విన్నది నిజమే. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా శివగిరి గ్రామ సమీపంలో పాత పూసయ్య ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే ఆలయ ఆచారాల ప్రకారం భక్తులు శివుడికి సమర్పించిన నిమ్మకాయలు, పండ్లతో పాటు ఇతర వస్తువులను ఉత్సవాలు ముగిసిన తర్వాత వేలం వేశారు. ఈ వేలం పాటలో స్వామివారికి సమర్పించిన అనేక వస్తువులను దక్కించుకోవటం కోసం స్థానికులు పోటీ పడ్డారు. ఈ వేలంలో సుమారు 15 మంది భక్తులు పాల్గొన్నారు.
ఈ రోడ్‌కు చెందిన ఒక భక్తుడు గుడిలో దేవుడికి సమర్పించిన నిమ్మకాయను 35 వేల రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నాడు. నిమ్మకాయ కోసం ఆయన వేలంలో పోటీ పడ్డాడు. వందలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ పూజారి పూజ నిర్వహించిన అనంతరం ఆ భక్తుడికి ఆ నిమ్మకాయను అందజేశారు. శివుడికి పూజ చేసి, ఆయనకు సమర్పించిన నిమ్మకాయను వేలం పాటలో దక్కించుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సంపద వృద్ధి జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఈ నిమ్మకాయ తమకు సర్వశుభాలను తెస్తుందని నమ్మి 35 వేల రూపాయలు ధర పెట్టి మరీ వేలంపాటలో దక్కించుకున్నాడు.