Tamil Nadu CM Stalin satire on central taxes and GST
CM Stalin: పేదలంటే బీజేపీకి ఎందుకంత ద్వేషమని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్నించారు. చిన్న టీ షాపుల నుంచి టూవీలర్ రిపేర్ల దాకా అన్నింట్లో కేంద్రం పన్ను విధిస్తుందని, మధ్యతరగతి ప్రజలను ఎందుకు దోచుకుంటున్నారని ఎంకే స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ పేదల నడ్డి విరచడమే పనిగా పెట్టుకున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ వేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ వేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. పేదలను హింసిస్తున్న ఈ బీజేపీ కార్పొరేట్ వ్యక్తుల కొమ్ముకాస్తుందని విమర్శించారు.
పేద, మధ్య తరగతి వారిపై బీజేపీ కరుణ చూపదా అని ప్రశ్నించారు. కార్పొరేట్ పెద్దలకు సంబంధించిన 1.45 లక్షల కోట్ల పన్ను బీజేపీ మాఫీ చేసిందని, ఇదెక్కడి న్యాయం అని అన్నారు. మొత్తం జీఎస్టీలో ఏకంగా 64 శాతం అట్టడుగు వర్గాల నుంచి, 33 శాతం మధ్యతరగతి ప్రజల నుంచి వస్తుందని, ధనికులు చెల్లించే జీఎస్టీ కేవలం 3 శాతమేనని వివరించారు. ఈ దోపిడి వ్యవస్థను మార్చాలంటే ఇండియా కూటమికి ఓటేయ్యాలంటూ తమిళనాడు ప్రజలకు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.