వందేభారత్ రైళ్లపై దాడులు కలకలం రేపుతోన్నాయి. పశ్చిమ బెంగాల్, విశాఖపట్టణంలో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బీహార్‌లో గల కతిహార్ జిల్లాలో ఈరోజు దాడి జరిగింది. 22302 నంబర్ రైలుపై దుండగులు రాళ్లతో దాడిచేశారు. సీ6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య గతేడాది డిసెంబరు 30వ తేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే రైలుపై రాళ్ల దాడి జరిగింది. సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి ముందే విశాఖపట్టణంలో దాడి జరిగింది. ట్రయల్ రన్ ముగించుకుని మర్రిపాలెంలో కోచ్ మెయింటెనెన్స్ సెంటర్‌కు వెళ్తున్న రైలుపై దుండగులు రాళ్లదాడి చేశారు. కిటీకి అద్దాలు దెబ్బతిన్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.
ట్రయల్ రన్ కోసం చెన్నై ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి వందేభారత్ రైలు నేరుగా ఈ నెల 15వ తేదీన విశాఖపట్టణానికి వచ్చింది. సాధారణ మెయింటెనెన్స్ కోసం కోచ్ కేర్ సెంటర్‌కు తరలిస్తుండగా కంచరపాలం సమీపంలో రామ్మూర్తి పంతులు గేటు వద్ద అగంతకులు ట్రైన్ పైకి రాళ్ళు విసిరారు. కోచ్‌కు చెందిన రెండు గ్లాస్లు పగిలిపోయాయి. శంకర్, దిలీప్, చందులను అనుమానితులుగా గుర్తించారు. వీరిపై గతంలో హత్యాయత్నం, పలు రైల్వే కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.