In Bihar, a groom hides his baldness and is ready for his second marriage.
Bihar: ఓ వరుడు పెళ్లికి రెడీ అయ్యి మండపంలో పీటలపై కూర్చున్నాడు. కాసేపట్లో వధువు వస్తే తాళి కట్టడమే తరువాయి. ఇంతలో అసలు నిజం బయటపడింది. విగ్గుపీకి బోడిగుండు బొప్పి కట్టేలా బడితపూజ చేశారు వధువు బంధువులు. అసలు విషయం ఏంటంటే బిహార్‌లోని గయ జిల్లా డోభీ పోలీస్‌స్టేషను పరిధి బజౌరా గ్రామంలో ఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఇది వరకే పెళ్లి అయిన ఓ వ్యక్తి ఆ విషయం దాచిపెట్టి మరో యువతిని రెండోపెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
అయితే వరుడికి బట్టతల కూడా ఉండటంతో దాన్ని దాచి మరీ రెండో పెళ్లికి ముస్తాబు అయ్యాడు. విగ్గు ధరించి పెళ్లిమండపానికి వచ్చాడు. కొద్దిసేపట్లో పెళ్లి అవుతుందనగా వధువు బంధువులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా.. అతడికి ఇది రెండోపెళ్లని, విగ్గు ధరించి వివాహానికి వచ్చాడన్న అసలు నిజం బయటపడింది. దీంతో కోపగించిన వధువు బంధువులు పెళ్లికొడుకు బడితపూజ చేశారు. ఆ దెబ్బలకు, వారి తిట్లకు తట్టుకోలేక తాను చేసింది తప్పేనని, వదిలేయాలంటూ నిందితుడు ప్రాధేయపడ్డాడు. ఇక విషయం తెలుసుకున్న అతడి భార్య సైతం ఘటనా స్థలానికి రావడం కొసమెరుపు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రామపెద్దలు పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కారించారు.