»Educational Institutions Are Closed In Telangana Today What Is The Reason
Telangana: నేడు విద్యాసంస్థలు బంద్..కారణం ఏంటంటే.?
తెలంగాణ విద్యావ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ రోజు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి.
Telangana: అన్ని రంగాల్లో ముందు ఉన్నాము అని సంబరాలు చేసుకునే తెలంగాణ ప్రభుత్వానికి(TS Government) విద్యారంగం(Education)లోని సమస్యలు కనిపించడం లేదంటూ.. విద్యారంగంలో అభివృద్ధి శూన్యం అంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు(Left Student Unions) ఆరోపిస్తున్నాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదని,
ఇక నైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దందా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నా, ప్రభుత్వం వాటిని కట్టడి చేయడం లేదంటూ లెప్ట్ వింగ్ స్టూడెంట్ యూనియన్స్ పేర్కొంటున్నాయి. విద్యా సమస్యలపై ఇటీవల భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ సైతం పెద్దగా సమస్యలపై దృష్టి పెట్టలేదని మండిపడ్డాయి. ఫీజుల నియంత్రణ విషయంలో కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్, తిరుపతిరావు కమిటీ నివేదికలు ఎందుకు బయటకు చెప్పలేదు. అంటే పరోక్షంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
కొన్ని ఏళ్లుగా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. విద్యార్థులందరికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందలేదని, కొన్ని చోట్ల చదువులు చెప్పే టీచర్లు లేక.. మరికొన్ని చోట్ల మౌళిక సదుపాయాలు లేవని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు లేవని… మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్ వంటి సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని.. అందుకే బంద్ కు పిలుపునిచ్చినట్లు వామపక్ష విద్యార్థి సంఘాలు AISF, SFI, AIDSU, PDSU తెలిపాయి.