Heat Stroke : భారత దేశ వ్యాప్తంగా వడగాలులు.. ఒక్క రోజులోనే 50 మంది బలి
దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఎండల ప్రభావానికి గత 24 గంటల్లో 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 26 మంది మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Summer: Record high temperatures. Six people died due to sunstroke
Heat Stroke Deaths In India : భారత దేశ వ్యాప్తంగా వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఒడిస్సాలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఒక్క గురువారమే దేశ వ్యాప్తంగా వడగాల్పుల వల్ల మొత్తం 50 మంది ప్రాణాలు విడిచారు. బిహార్(BIHAR)లోనే గడచిన 24 గంటల్లో 26 మంది ఎండలకు బలయ్యారు. ఇంతటి ఎండలను గతంలో ఎప్పుడూ చూడలేదంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిల్లీలో ఐఎండీ ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ సమయంలో ఎవరూ బయటకు రాకూడదని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా దిల్లీ, రాజస్థాన్, పంజాబ్, బిహార్‌ల్లో వేసవి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. బిహార్‌లో ఎన్నికల విధుల్లో పని చేస్తున్న జవాన్ ఒకరు ఎండలకు బలయ్యారు. రోహ్తాస్లో ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు ప్రాణాలు విడిచారు. అలాగే అర్రాలో ఎండ వేడికి ఐదుగురు పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు చనిపోయారు.
ఝార్ఖండ్‌లోనూ వేడి గాలులు ఎక్కువగా ఉన్నాయి. గురువారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. అలాగే ఒడిశా(ODISHA)లోనూ 16 మంది చనిపోయారు. అక్కడి సుందర్‌గఢ్ డిస్ట్రిక్ట్‌లోని రవుర్కెలా గవర్నమెంట్ ఆసుపత్రిలోనే పది మంది మృతి చెందారు. శవ పరీక్షల్లో వీరంతా వడదెబ్బ(HEAT STROKE) తినడం వల్లే చనిపోయినట్లు తేలింది. చనిపోయిన వారే కాకుండా ఎండ దెబ్బతో ఇంకా వందల సంఖ్యలో వ్యక్తులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.