అరేబియా సముద్రంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుపాను బిపోర్ జోయ్ (Bipor Joy)గుజరాత్ తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. పాకిస్థాన్ లోని కరాచీ, గుజరాత్ (Gujarat) కచ్ జిల్లాలోని మాండ్వీ మధ్య ఇది తీరాన్ని దాటుతోంది. అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపోర్ జోయ్ తుపాను పూర్తిగా భూభాగం పైకి చేరేందుకు ఈ అర్ధరాత్రి వరకు సమయం పడుతుందని ఐఎండీ తెలిపింది.ప్రస్తుతం ఈ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది.తుపాను ప్రభావంతో గుజరాత్ తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉద్ధృతంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో గంటకు 150 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది.
ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 94 వేల మందిని ఖాళీ చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.ఎక్కడికక్కడ ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.తుపాన్ నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా/తగ్గించేందుకు ప్రభుత్వం సహాయక బృందాలను సిద్ధంగా ఉంచింది. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సహాయక చర్యల కోసం 15 షిప్స్, 7 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. నేవీ, ఆర్మీ సిబ్బంది అందుబాటులో ఉన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (CM Bhupendra Patel) ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తుపాను వేళ అప్రమత్తమైంది. తుపాన్ ఇవాళ ఉదయమే పాకిస్థాన్ తీరాన్ని తాకింది. నష్టం అంచనాలకు మించి ఉండొచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.