దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను మన సినీ నటీనటులు చక్కగా ఫాలో అవుతున్నారు. ఫామ్ లో ఉన్నప్పుడే కొంత వెనుకేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. తమ ఫేమ్, ఫాలోయింగ్ ను ఆసరాగా చేసుకుని వ్యాపార రంగంలోకి దిగుతున్నారు. భవిష్యత్ కు ఆర్థిక భరోసా ఉండేందుకు ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. అందుకే అగ్రతారల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు సొంత వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఫ్యాషన్, థియేటర్ వ్యాపారంలోకి దిగిన మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా క్రీడా వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఐపీఎల్ మాదిరి వాలీబాల్ లో జరిగే ప్రైమ్ వాలీబాల్ లీగ్ లోకి ప్రవేశించాడు. ఈ లీగ్ లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం వహిస్తున్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అనే జట్టుకు విజయ్ సహ యజమాని (కో స్పాన్సర్)గా వ్యవహరిస్తున్నాడు.
వాలీబాల్ కు దేశంలో ప్రాధాన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మాదిరి ప్రైమ్ వాలీబాల్ లీగ్ మొదలుపెట్టారు. తొలి సీజన్ పూర్తవగా.. రెండో సీజన్ ఫిబ్రవరి 4 నుంచి మార్చి 5వ తేదీ వరకు జరగనుంది. ఈ లీగ్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా.. వాటిలో మన హైదరాబాద్ తో పాటు అహ్మదాబాద్, కోల్ కతా, కాలికట్, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై జట్లు ఉన్నాయి. మన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టుకు అభిషేక్ రెడ్డి కనకాలతో కలిసి విజయ్ స్పాన్సర్ చేస్తున్నాడు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘బ్లాక్ హాక్స్ మరో స్పోర్ట్స్ జట్టు అని కాకుండా అంతకుమించినది. తెలుగు వారసత్వం సగర్వంగా చాటాలనుకునే మా అందరికీ గర్వకారణం ఇది. తెలుగు ప్రజలకు బ్లాక్ హాక్స్ ప్రాతినిధ్యం వహించడమే కాకుండా మన స్ఫూర్తి, శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్, జట్టును దేశంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు శాయశక్తులా పని చేస్తా’ అని తెలిపాడు. హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ సందడి చేశాడు. ఈ సందర్భంగా The VD అని రాసి ఉన్న జెర్సీలను ఆవిష్కరించాడు.