మాస్ మహారాజాను మోసం చేశారా? అంటే, ఔననే మాట వినిపిస్తోంది. సంక్రాంతికి రావాల్సిన మాస్ రాజా 'ఈగల్' సినిమాను పట్టుబట్టి మరీ ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. సోలో రిలీజ్ అంటూ ఊరించారు. కానీ ఇప్పుడు రవితేజకు పోటీగా మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
Eagle: ఈసారి సంక్రాంతికి గుంటూరు కారంతో మహేష్ బాబు, సైంధవ్‌తో వెంకటేష్, నా సామీ రంగాతో నాగార్జున, తేజ సజ్జా హనుమాన్తో పోటీగా రవితేజ ఈగల్ కూడా రిలీజ్ కావాల్సింది. కానీ థియేటర్ల సమస్య వల్ల జనవరి 13 నుంచి ఈగల్ వెనకడుగు వేసింది. సంక్రాంతి సినిమాల ప్రొడ్యూసర్స్ అంతా కలిసి రవితేజను రిక్వెస్ట్ చేయగా.. ఫిబ్రవరి 9కి ఈగల్‌ను వాయిదా వేసుకున్నాడు. అంతేకాదు.. సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్టున్నారు. సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ను కూడా వాయిదా వేయించారు. కానీ ఈగల్కి పోటీగా ఇప్పుడు మరో మూడు సినిమాలు దూసుకొస్తున్నాయి.
యాత్ర 2, ఊరిపేరు భైరవకోన సినిమాలు కూడా ఫిబ్రవరి 9నే రిలీజ్ కాబోతున్నాయి. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఊరు పేరు భైరవకోన’ వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు.. అనుకున్న సమయానికే విడుదలవుతుందంటూ లేటెస్ట్గా క్లారిటీ ఇచ్చేశాడు సందీప్ కిషన్. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న యాత్ర2 కూడా ఈగల్‌కు పోటీగా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఇవి చాలవన్నట్టు.. సూపర్ స్టార్ రజినీకాంత్ స్పెషల్ క్యామియో ప్లే చేసిన లాల్ సలామ్ సినిమా కూడా ఫిబ్రవరి 9నే రిలీజ్ అవనుంది. దీంతో ఈగల్ మూవీ టఫ్ ఫైట్ ఫేస్ చేయక తప్పదు. దీంతో రవితేజకు సంక్రాంతి నుంచి తప్పుకుంటే ఒరిగిందేంటి? అనేది అర్ధం కాకుండా పోయింది. పైగా ఈగల్ మూవీకి సోలో రిలీజ్ అంటు బిల్డప్‌లు ఇస్తున్నారని.. మాస్ రాజాను మోసం చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫిబ్రవరి 9న ఎవరైనా వెనక్కి తగ్గుతారేమో చూడాలి.