2022లో సంచలనంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లే అవుతోంది. కానీ అప్పుడే రీ రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. మరి ఆర్ఆర్ఆర్ సినిమాను ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు? ఇప్పుడే ఎందుకు విడుదల చేస్తున్నారు?
RRR Re-Release: భారతీయ సినీ ఖ్యాతిని ఆస్కార్‌కు తీసుకెళ్లి.. ప్రతి ఒక్క తెలుగోడు గర్వంగా చెప్పుకునేలా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కింది. 2022 మార్చి 25న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ దగ్గర 1300 కోట్లకు పైవగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వరించగా.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ఖాతాలో వచ్చిన అవార్డులు, రివార్డులు ఎన్నెన్నో. ఇక చరణ్, ఎన్టీఆర్‌కు గ్లోబల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఆర్ఆర్ఆర్. ఇలా చెప్పుకుంటే పోతే.. ఈ సినిమా గురించి చాలా విషయాలు ఉన్నాయి. అందుకే.. ఇలాంటి సినిమాను రెండేళ్లకే రీ రిలీజ్ చేస్తున్నారు.
మామూలుగా అయితే.. హిట్ బొమ్మలను ఐదేళ్లకో, పదేళ్లకో రీ రిలీజ్ చేస్తుంటారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాను మాత్రం రెండు సంవత్సరాలకే మళ్లీ విడుదల చేస్తుండడం విశేషం. దానికి కారణం కూడా లేకపోలేదు. ప్రజెంట్ సమ్మర్లో పెద్ద సినిమాలేవి రిలీజ్‌కు రెడీగా లేవు. పైగా ఎలక్షన్స్ హడావిడి ఉంది. దీంతో సరదాగా థియేటర్లకు వెళ్దామనుకునే కామన్ ఆడియెన్‌తో పాటు.. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మరోసారి RRRను థియేటర్లలో ఎంజాయ్ చేయడం పక్కా. పైగా ఈసారి 2డీ, 3డీ ఫార్మాట్లతో పాటు 4K వెర్షన్‌తో రీ రిలీజ్ చేస్తున్నారు. మే 10న ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ కానుందని.. పెన్ మూవీస్, పీవీఆర్ సినిమా కలిసి అధికారికంగా ప్రకటించాయి. అయితే.. తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.