విరాట పర్వం సినిమా తర్వాత ఆచితూచి అడుగెస్తున్నాడు దగ్గుబాటి రానా. ఇప్పటికే హిరణ్యకశ్యప సినిమాను ప్రకటించిన రానా.. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. తేజతో కలిసి రాక్షస రాజాగా వస్తున్నాడు.
గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు ఇస్తునే ఉన్నాడు దర్శకుడు తేజ. కానీ ఆ మధ్యలో రానాతో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న తేజ, దగ్గుబాటి రానాతో కలిసి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా.. తేజ కెరీర్లోనే ఒక స్పెషల్ ఫిల్మ్‌గా నిలిచిపోయింది నేనే రాజు నేనే మంత్రి. ఈ సినిమా తేజలోని కొత్త దర్శకుడిని పరిచయం చేస్తే, రానా నుంచి మంచి ఛేంజ్ ఓవర్ చూపించింది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో కనిపిస్తునే ఉంటాయి. ఇక ఈ సినిమా తర్వాత తేజ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడని అనుకున్నారు.
కానీ మళ్లీ తేజ డిసప్పాయింట్ చేసేశాడు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత చేసిన ‘సీత’ సినిమాతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. చివరగా రానా తమ్ముడు అభిరామ్‌ను ‘అహింస’ అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ సినిమాతో ఆడియెన్స్ హింసించాడు తేజ. దాంతో అహింస డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే ఇప్పుడు మరోసారి రానాతో కలిసి హిట్ కొట్టేందుకు వస్తున్నాడు. ఈసారి రానాని రాక్షసుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు తేజ. డిసెంబర్ 13న రానా బర్త్ డే కావడంతో ‘రాక్షస రాజా’ టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో రానా.. నామాలు పెట్టుకోని, చుట్ట తాగుతూ, ఒక పెద్ద గన్ని భుజాన వేసుకోని వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో తేజ మరోసారి సత్తా చాటేందుకు రెడీ అయ్యాడనే చెప్పాలి. మరి ఈసారి రాక్షస రాజా ఏం చేస్తాడో చూడాలి.