ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.హైదరాబాదులోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శరీరం మొత్తం విషతుల్యం కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం (liver) ఇతర అవయవాలపై పడినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం శరత్ బాబు ఐసీయూ (ICU) లో వింటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.శరత్ బాబు అస్వస్థతకు గురి కావడంతో శుక్రవారం బెంగళూరు (Bangalore) నుంచి ఆయన్ను హైదరాబాద్ సిటీకి తీసుకు వచ్చారు. గచ్చిబౌలి (Gachibowli) లోని ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఐసీయూలో శరత్ బాబుకు చికిత్స అందిస్తున్నారు.
కమల్ హాసన్(Kamal Haasan), జయసుధ, చిరంజీవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ఇది కథ కాదు’ సినిమాతో తనకు బ్రేక్ వచ్చిందని శరత్ బాబు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కె. బాలచందర్ (K. Balachander) దర్శకత్వం వహించిన ఆ సినిమా, తమిళంలో ఆయన తీసిన ‘అవరాగళ్’ సినిమాకు రీమేక్. తమిళ సినిమాలో కూడా శరత్ బాబు నటించారు. హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా… పరిస్థితిని బట్టి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కూడా శరత్ బాబు చేశారు. అందువల్ల, ఆయన కెరీర్ ఎక్కువ కాలం కొనసాగింది. ‘మూడు ముళ్ల బంధం’, ‘సీతాకోక చిలుక’, ‘సంసారం ఒక చదరంగం’, ‘అన్నయ్య’, ‘ఆపద్భాందవుడు’, ‘సాగర సంగమం’, ‘బొబ్బిలి సింహం’, ‘శివరామ రాజు’ వంటి చిత్రాల్లో ఆయన మంచి పాత్రలు పోషించారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ (K. Vishwanath) దర్శకత్వం వహించిన సినిమాల్లో శరత్ బాబుకు మంచి పాత్రలు లభించేవి. శరత్ బాబు, రమాప్రభ (Ramaprabha) కొన్ని సినిమాల్లో జంటగా నటించారు. సినిమా షూటింగుల్లో మొదలైన పరిచయం పెళ్లి పీటల వరకు దారి తీసింది. అయితే, ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. 1974లో పెళ్లి చేసుకుంటే… 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి స్నేహ నంబియార్ (Sneha Nambiar)ను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో 2011లో విడాకులు అయ్యాయి. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శరత్ బాబుకు కుమారులు ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వాళ్ళు దగ్గర ఉండి మరీ చూసుకుంటున్నట్లు తెలిసింది.