»Underworld Gangster Dawood Ibrahim Was Poisoned Secretly Treated In The Hospital
Dawood Ibrahim : గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం..సీక్రెట్‌గా ఆస్పత్రిలో చికిత్స!
అండర్ వరల్డ్ డాన్‌గా పేరొందిన దావూద్ ఇబ్రహీం అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. ఆయనపై విషప్రయోగం జరిగిందని, ఆయన సన్నిహితులే ఆయనపై విషప్రయోగం చేసినట్లు పాక్ వర్గాల సమాచారం.
అండర్ వరల్డ్ డాన్‌గా పేరొందిన దావూద్ ఇబ్రహీం తీవ్ర ఆరోగ్య సమస్యలతో కరాచీలోని ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ వర్గాలు వెల్లడించాయి. దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో కరాచీలోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. దావూద్ కు అతని సన్నిహితులే విషప్రయోగం చేయగా ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైనట్లు సమాచారం. అయితే దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగినట్లు వచ్చిన వార్తలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.
గత రెండు రోజులుగా దావూద్ కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చర్చ సాగుతోంది. 1993 ముంబయిలో జరిగిన పేలుళ్లలో దావూద్ కీలక పాత్ర పోషించాడని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీంను గట్టి భద్రతల మధ్య ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలోకి ఆయన కుటుంబసభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. దావూద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలోనే ఉంటున్నట్లు ఆయన సోదరి హసీనా పార్కర్ తెలిపారు.
దావూద్ ఇబ్రహీం ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడిగా పేరుపొందాడు. ముంబయి పేళ్లుళ్ల వల్ల 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. దావూద్ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ, ఆయుధాల స్మగ్లింగ్ వంటివి చేస్తూ తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పాక్ ప్రభుత్వ అధికారులు లీకులు వదిలారు. మరోవైపు దావూద్‌ను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది.