»The Death Toll In Libya Has Exceeded 11000 10000 Are Missing
Libya Floods: 11 వేలు దాటిన లిబియా మృతుల సంఖ్య.. 10 వేల మంది గల్లంతు!
లిబియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వరదల కారణంగా 11 వేల మందికి పైగా మరణించారు. ఇంకా 10 వేల మంది గల్లంతయ్యారు. 30 వేల మంది నిరాశ్రయులుగా మిగిలారు.
లిబియా (Libya)లో వరదలు (Floods) విధ్వంసం సృష్టించాయి. భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 11 వేలకు చేరింది. ఈ ఘటనలో 10 వేల మందికిపైగా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఇంకా 30 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని ట్రిపోలీలోని ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వరదల వల్ల మట్టిలో కూరుకుపోయి చనిపోయిన వారిని బయటకు వెలికితీస్తున్నారు. లిబియాలో ఎటుచూసినా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి.
అనేక ఆసుపత్రులు మృతదేహాల (Deadbodies)తో నిండిపోయాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. డేనియల్ తుఫాను సమయంలో ఆనకట్ట తెగిపోవడంతో సునామీ లాంటి వరదలు చాలా గ్రామాలపై విరుచుకుపడ్డాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. రెస్క్యూ టీమ్లు కూలిన భవనాల శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నాయి.
తప్పిపోయిన 10 వేల మంది కూడా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయినప్పటికీ తమ దేశానికి చాలా సాయం అవసరమని లిబియా (Libya) ప్రభుత్వం ఇతర దేశాలను కోరింది.