»The Death Toll From The Earthquake Has Crossed 45000
Turkey-Syria Earthquake: 45వేలు దాటిన భూకంపం మృతుల సంఖ్య
టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాల్లో భారీ భూకంపం(Earthquake) వల్ల మరణ మృదంగం ఇంకా కొనసాగుతోంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ రెండు దేశాల్లో ఇప్పటి వరకూ 45 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాల్లో భారీ భూకంపం(Earthquake) వల్ల మరణ మృదంగం ఇంకా కొనసాగుతోంది. ఆ దేశాల్లో గత వారం భారీ భూకంపం(Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ రెండు దేశాల్లో ఇప్పటి వరకూ 45 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క టర్కీ(Turkey)లోనే 39,672 మంది ప్రాణాలు విడిచారు. అలాగే సిరియా(Syria)లో 5,800 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
శిథిలాల కింద ఉన్న బాలుడ్ని రక్షిస్తున్న అధికారులు :
భారీ భూకంపం(Earthquake) వల్ల రెండు దేశ భూభాగాల్లో వేల సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఇంకా అనేక మంది ప్రజలు చిక్కుకుని ఉన్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు శ్రమపడుతున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. దీంతో గడ్డ కట్టే వాతావరణం కారణంగా శిథిలాల కింద ఉన్న ప్రజలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.
మరోవైపు టర్కీ(Turkey), సిరియా(Syria)లో భూకంపం(Earthquake) సంభవించి 12 రోజులు అవుతోంది. ఈ సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడటం కష్టతరమైంది. అయితే కొందరు మాత్రం సురక్షితంగా బయటపడుతున్నారు. తాజాగా టర్కీ(Turkey)లో భూకంపం శిథిలాల కింద చిక్కుకుని ఉన్న 45 ఏళ్ల వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడింది. భూకంపం(Earthquake) సంభవించి సుమారు 278 గంటలు అవుతున్నా దాదాపు 12 రోజుల తర్వాత కూడా ఆ వ్యక్తి శిథిలాల కింద సజీవంగా ఉండటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరోవైపు రెండు భూభాగాల్లో సుమారు 200 ప్రాంతాల్లో శిథిలాలను తొలగిస్తూ అధికారులు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు టర్కీ(Turkey) ఉపాధ్యక్షుడు ఫువాట్ ఓకటే వెల్లడించారు. గత రెండు రోజుల నుంచి ముగ్గుర్ని కాపాడారని, అందులో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలిపారు. భూకంపం(Earthquake) వల్ల 11 ప్రావిన్సుల్లో నష్టం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. టర్కీ(Turkey), సిరియా(Syria)లో ఎటు చూసినా శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు మూకుమ్మడిగా శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరో విషాదకర వార్త తెలిసింది. ఘనా దేశపు ఫుల్ బాలర్, న్యూక్యాజిల్ జట్టు మాజీ మిడ్ ఫీల్డర్ క్రిస్టియన్ అట్సు మృతదేహాన్ని శిథిలాల కింద అధికారులు గుర్తించారు. తాను నివసిస్తున్న ఇంటి శిథిలాల కింద ఆయన డెడ్ బాడీ కనిపించిందని మీడియాకు తెలియజేశారు.