»Saveera Parkash Hindu Woman In Pakistan Elections
Saveera Parkash: పాక్ ఎన్నికల బరిలో హిందూ మహిళ
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ పోటీ చేయనున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున అభ్యర్థిగా పీకే-25 స్థానానికి సవీరా ప్రకాశ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేశారు.
Saveera Parkash: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ పోటీ చేయనున్నారు. ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బునేర్ జిల్లాలోని ఒక జనరల్ స్థానం నుంచి డాక్టర్ సవీరా ప్రకాశ్ పోటీలో నిలిచారు. హిందూ మహిళ అయిన సవీరా.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున అభ్యర్థిగా పీకే-25 స్థానానికి ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేశారు. పాక్ జనరల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న తొలి హిందూ మహిళగా సవీరా రికార్డు సృష్టించారు.
35ఏళ్ల సవీరా అబోట్టాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఓమ్ ప్రకాశ్ కూడా ఒక డాక్టర్. ఇటీవల పదవీ విరమణ చేసిన ఆయన 35 ఏళ్ల నుంచి పీపీపీలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న సవీరా.. గత కొన్నేళ్ల నుంచి బనేర్ పీపీపీ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తమ ప్రాంతంలో మహిళా సాధికారత, భద్రత, మహిళ హక్కుల కోసం పాటుపడతానని చెబుతున్నారు.
అభివృద్ధిలో మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని, అణచివేతకు గురిచేస్తున్నారని.. వీటికోసం పోరాడతానని ఆమె తెలిపారు. పాకిస్థాన్‌లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశించి ఇటీవల పాక్ ఎన్నికల సంఘం కీలక సవరణ చేసింది. అందులో భాగంగా జనరల్ స్థానాల్లో మహిళలకు ఐదు శాతం సీట్లు తప్పనిసరి చేసింది. పాకిస్థాన్‌లో 16వ నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు 2024, ఫిబ్రవరి 8 జరగనున్నాయి.