Indian mining tycoon Harpal Randhawa, son killed in Zimbabwe plane crash
Harpal Randhawa: బిలియనీర్, మైనింగ్ టైకూన్ హర్పాల్ రాంద్వానా (Harpal Randhawa) కన్నుమూశారు. నైరుతి జింబాబ్వేలో గల వజ్రాల గని సమీపంలో జ్వామహండే వద్ద ప్రైవేట్ విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు ఉన్నారు. హర్పాల్తోపాటు అతని కుమారుడు అమీర్ కూడా ఉన్నారు. సాంకేతిక కారణంతో ప్రమాదం జరిగిందని నివేదికలు తెలియజేస్తున్నారు.
రియోజిమ్ కంపెనీ యజమాని హర్పాల్. బంగారం, బొగ్గు, నికెల్, రాగిని శుద్ది చేసే మైనింగ్ కంపెనీ ఇది. రియోజిమ్కు చెందిన సెస్పా 206 విమానంలో హర్పాల్ ప్రయాణిస్తున్నాడు. శుక్రవారం రోజున హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
రియోజిమ్కు చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలో సింగిల్ ఇంజిన్తో కూడిన విమానం కూలిపోయిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. జ్వామహండే వద్ద పీటర్ ఫామ్లోకి వెళ్లే సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చు. గాలిలో ఉండగానే పేలుడు సంభవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మిగతా నలుగురు మృతుల వివరాలను పోలీసులు ఇంకా ప్రకటించలేదు. నలుగురు విదేశీయులు కాగా.. ఇద్దరు జింబాబ్వేకు చెందిన వారు అని మాత్రం తెలిపారు. హర్పాల్ స్నేహితుడు జర్నలిస్ట్, నిర్మాత హోప్ వెల్ చినోనో విమాన ప్రమాదాన్ని ధృవీకరించారు. తండ్రికొడుకుల సేవ గురించి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.