»Destruction Of Floods 6 Thousand People Died In Libya
6000 dead: వరదల విధ్వంసం..6 వేల మంది మృతి
లిబియాలో తుఫాను వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. దీంతో భారీ వరదల కారణంగా 6000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు 30 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారని వెల్లడించారు.
Destruction of floods 6 thousand people died in libya
లిబియాలో వినాశకరమైన వరదల కారణంగా 6,000 మందికి పైగా మరణించారని, 30,000 మందికిపైగా నిరాశ్రయులయ్యారని అక్కడి అధికారులు చెబుతున్నారు. బుధవారం ఉదయం మృతుల సంఖ్యను సవరించినట్లు ట్రిపోలీలోని ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వరదలు నిరంతరం డజన్ల కొద్దీ వ్యక్తులను బలితీసుకుంటున్నాయని అక్కడి మంత్రి పేర్కొన్నారు. అనేక మంది మృత్యువాత చెందడంతో సామూహిక సమాధులలో ఖననం చేయడానికి అనేక మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అనేక ఆసుపత్రులు మృతదేహాలతో నిండిపోయాయని ఆరోగ్యాధికారులు పేర్కొన్నారు.
డేనియల్ తుఫాను సమయంలో ఆనకట్ట తెగిపోవడంతో ఆదివారం నాడు డెర్నా గుండా సునామీ లాంటి వరద నీరు పలు ప్రాంతాల్లోకి ప్రవహించిందని అధికారులు అంటున్నారు. దీంతో భారీగా నష్టం జరిగినట్లు వెల్లడించారు. మరోవైపు రెస్క్యూ టీమ్లు కూలిపోయిన భవనాల శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. అయితే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో దాదాపు 10,000 మంది తప్పిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నిరాశ్రయులైన వారు తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తమకు సాయం చేయాలని కోరుతున్నారు.