పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో గల కోహిస్థాన్ జిల్లా కారకోరం హైవేపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. తర్వాత అవీ లోయలోకి పడిపోయాయి. ఎదురుగా వస్తున్న కారును గిల్గిట్ నుంచి రావల్పిండికి వస్తోన్న ప్రయాణికుల బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు చనిపోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆర్‌హెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. చీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది.
బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సంతాపం తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు ఆ దేవుడు మనోధైర్యం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని గిల్గిత్ బాలిస్థాన్ సీఎం ఖాలీద్ ఖుర్సీద్ అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదాలు కామన్ అయ్యాయి. ఇందుకు కారణం రహదారుల పరిస్థితి బాగోలేకపోవడమే. వాహనాలు కూడా సరిగా ఉండవని, తనిఖీలు చేపట్టి పాత వాహనాలను సీజ్ చేయరని తెలుస్తోంది. డ్రైవర్లు అంతా ప్రొఫెషనల్స్ కాదని విశ్వసనీయ సమాచారం.
గత నెల 29వ తేదీన బలూచిస్థాన్‌లో ప్రయాణికులతో వస్తోన్న బస్సు లోయలో పడింది. ఆ ప్రమాదంలో 41 మంది మరణించారు.క్వెట్టా నుంచి కరాచీకి 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లాస్బెలా సమీపంలో గల వంతెన పిల్లర్‌ను ఢీకొట్టింది. లోయలో పడి బస్సులో మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు మరో ప్రమాదం జరిగింది.