foods for high blood pressure : ఉరుకుల పరుగుల జీవితాల్లో ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా కనిపిస్తున్న సమస్య హై బీపీ. భారత దేశంలో నూటికి 70 మంది ఈ బీపీ సమస్యలతో బాధ పడుతున్నారు. ఎక్కువగా ఉప్పును తీసుకోవడం దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. సరైన శారీరక శ్రమ చేయడం, వ్యాయామ, ఆహార నియమాలను పాటించడం ద్వారా దీని నుంచి మనం గట్టెక్కవచ్చని సూచిస్తున్నారు. అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారాలను(foods) తీసుకోవాలో తెలియజేస్తున్నారు.
హై బీపీ ఉన్న వారు గుమ్మడి, అవిస, చియా గింజల్లాంటి వాటిని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. బాదం, వాల్నట్స్, పిస్తా లాంటి వాటినీ రోజూ కాసిన్ని తినేందుకు ప్రయత్నించాలి. వీటిలో ఉండే పీచు పదార్థం, పోషకాలు బీపీని కంట్రోల్లో ఉంచేందుకు సహకరిస్తాయి. వీటిలో అర్జినైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. అది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి కావడాన్ని ప్రోత్సహిస్తుంది. అది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే బత్తాయి, కమల, నిమ్మ లాంటి సిట్రస్ జాతి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు 500 నుంచి 600 గ్రాముల వరకు నిమ్మ జాతి పండ్లు, లేదా రసాలను తీసుకుంటే రక్త పోటు తగ్గడాన్ని అధ్యయనాల్లో గమనించారు. ముఖ్యంగా గ్రేప్ ఫ్రూట్ రసం బీపీని(BP) బాగా నియంత్రిస్తుందని తేలింది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇన్ఫ్లమేషన్లను తగ్గించి రక్త పోటును నియంత్రిస్తాయి. అందుకనే బీపీ సమస్యలు ఉన్న వారు సాల్మన్, హెర్రింగ్, కాడ్ లాంటి కొవ్వు ఉండే చేపల్ని తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి రోజుకు రెండు, మూడు గ్రాములైనా శరీరానికి లభిస్తే చాలు. బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే ఆకు కూరల్లో ఎక్కువగా పొటాషియం, మెగ్నీషియంలు లభిస్తాయి. ముఖ్యంగా పాలకూర రక్త పోటు(BP) స్థాయిల్ని తగినంత ఉంచుతుంది. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో ఉపకరిస్తాయి.