సాధారణంగా చాలా మంది పారాసిటమాల్ టాబ్లెట్స్ వాడుతుంటారు. కాస్త జ్వరంగా ఉన్నా, ఒంటి నొప్పులున్నా ఆ మాత్రనే తీసుకుంటారు. దీర్ఘకాలిక నొప్పులకు కూడా పారసిటమాల్ తీసుకొంటారు. అలాంటి వారిని వైద్యులు హెచ్చిరిస్తున్నారు.
Paracetamol: సామాన్య ప్రజల ఇళ్లలో కూడా పారాసిటమాల్(paracetamol) టాబ్లెట్ ఉంటుంది. జ్వరం వచ్చినా, చిన్నచిన్న నొప్పులకు అది దివ్వ ఔషధంగా పనిచేస్తుంది. అద్భుతంగా పని చేస్తుంది కాబట్టే ప్రతీ ఒక్కరు ఈ మాత్రను నిరభ్యంతరంగా వాడుతారు. అలా వాడే వారికి ఓ హెచ్చరిక. ఎడిన్‌బరో యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ డ్రగ్ గురించి విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ముందు ఎలుకలపై ప్రయోగాలు చేసి వైద్యులు నిర్దారణకు వచ్చారు. ఎలుకలకు పారాసిటమాల్ ఇస్తూ వాటిలో కలిగే మార్పులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాటి కాలేయం దెబ్బతిన్నట్టు గుర్తించారు. పారాసిటమాల్‌ను అధికమోతాదులో తీసుకునే వారిలో కూడా ఈ పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించారు. 4 గ్రాముల మోతాదుకు మించి ఈ టాబ్లెట్ తీసుకోవడం మంచిది కాదని చెప్పారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నవారు డాక్టర్‌ను సంప్రదించకుండా పారాసిటమాల్ టాబ్లెట్‌ను అదేపనిగా వాడడం అంటే ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే అని తెలిపారు.
పారాసిటమాల్ డ్రగ్ శరీరంలోని కీలకమైన అవయవాలపై పనిచేస్తుంది. అందువలన ఆ అవయవ నిర్మాణాలను దెబ్బతీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాలేయం(liver), ఇతర అవయవాలకు మధ్యనున్న కణాజాలాన్ని పారాసిటమాల్ విశ్చిన్నం చేస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైందని శాస్ట్రవేత్తలు పేర్కొన్నారు. పారాసిటమాల్ కాలేయంపై అధిక ప్రభావం చూపుతుంది. అది మోతాదు మించితే కాలేయం దెబ్బతింటుందని గుర్తించిన మొదటి అధ్యయనం ఇదే. ఎడిన్‌బరో యూనివర్సిటీతోపాటు ఓస్లో, స్కాటిష్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సర్వీస్ పాల్గొన్న ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు.