High BP : రాత్రిళ్లు ఈ లక్షణాలుంటే హైబీపీ కావొచ్చు!
రక్త పోటు ఎక్కువ లేదా తక్కువ కావడం అనే విషయం కొంత మందిలో తేలికగా గుర్తించవచ్చు. అయితే కొంత మందిలో మాత్రం దాన్ని అంత త్వరగా గుర్తించలేం. ఒక వేల రాత్రి పూట నిద్ర సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నట్లైతే అవి హైబీపీకి సంకేతాలు కావొచ్చు. అవేంటంటే...
High BP symptoms at night : హైబీపీ అనేది ఉంటే కొంత మందికి కంగారు కంగారుగా అనిపిస్తుంది. గాబరాగా ఉన్నట్లు ఉంటుంది. గుండె దడ దడగా అనిపిస్తుంటుంది. సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తే బీపీని ఎవ్వరైనా చెక్ చేయించుకుంటారు. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించకుండా కూడా ఒక్కోసారి కొందరిలో హైబీపీ చాప కింద నీరులా ఉంటుంది. దాన్ని గుర్తించడం చాలా కష్టం. నిద్రలో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నట్లయితే దాన్ని మనం హైబీపీ (High BP) గా అనుమానించాల్సి ఉంటుంది. ఆ లక్షణాలు ఏమిటంటే…
కొంత మంది నిద్రపోతే మళ్లీ ఉదయం వరకు లేవరు. అలా ఉన్న వారు రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల బాధ పడుతుంటే వారు బీపీని ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ లక్షణాలు ఉన్న వారిలో తరచుగా నిద్రా భంగం కలుగుతుంది. లేదంటే మొత్తం రాత్రంతా మేల్కొనే ఉండాల్సి వస్తుంది. ఈ లక్షణాలు గనుక రోజుల తరబడి అనుభవంలోకి వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు వ్యక్తి తరచుగా నిద్ర నుంచి మేల్కొనాల్సి వస్తుంది. అలాగే తలనొప్పితో బాధ పడటం, తరచుగా మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం జరుగుతుంది. రక్త పోటు ఎక్కువగా ఉన్నప్పుడు మూత్ర పిండాలపై ఆ ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అందువల్ల నిద్ర పోతున్నా మూత్రం వెళ్లడానికి తరచుగా మెలకువ వచ్చేస్తూ ఉంటుంది.