స్కూల్ పిల్లలతో వెళుతున్న టూరిస్ట్ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 38 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎర్నాకులం జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఊటీకి వెళ్తున్న బస్సు..కోయంబత్తూరు వెళ్తున్న KSRTC బస్సును వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది.
వడక్కంచెరి పరిధిలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినపుడు టూరిస్ట్ బస్సులో 47 మంది ఉన్నట్లు తెలిసింది. KSRTC బస్సులో 81 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో ముగ్గురు ప్రమాదంలో మరణించారని అధికారులు ప్రకటించారు. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ టూరిస్ట్ బస్సు అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు.