»Rs 854 Crore Scam Through Whatsapp And Telegram Six Members Arrested
Cyber Crime: వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా రూ.854 కోట్ల స్కామ్..ఆరుగురు అరెస్ట్
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అమాయకులు పడిపోతున్నారు. తాజాగా వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా రూ.854 కోట్లను దోచుకున్న కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసులో ఆరుగురిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
టెక్నాలజీ (Technology)ని ఉపయోగించి సైబర్ నేరాలు (Cyber crimes) పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ కోటానుకోట్ల వరకూ కుంభకోణం (Scams) జరిగింది. తాజాగా మరో రూ.854 కోట్ల సైబర్ స్కామ్ (Cyber Scam)ను బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణలో పోలీసులు విలువైన విషయాలను రాబట్టారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సైబర్ గ్యాంగ్ చాలా మందిని మోసం చేసినట్లుగా గుర్తించారు. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (Investment Scheme) పేరుతో ఈ స్కామ్ జరిగింది.
సైబర్ నేరాళ్ల నుంచి రూ.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా ఈ స్కామ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. మొదట్లో చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని సైబర్ నేరగాళ్లు బాధితుల్ని ఆశ్రయించేవారు. ఆ తర్వాత వెయ్యి నుంచి పది వేల వరకూ జమ చేస్తే, ప్రతి రోజూ ఆ అమౌంట్‌పై రూ.5 వేల వరకూ లాభం పొందొచ్చని ఆశ చూపేవారు. అలా ఆ సైబర్ గ్యాంగ్ అనేక మందిని మోసం చేసి వారి నుంచి డబ్బును ఇన్వెస్ట్ చేయించారు.
సుమారు రూ.854 కోట్ల మొత్తాన్ని ఆన్లైన్ పేమెంట్ (Online Payment) అకౌంట్లకు నిందితులు ట్రాన్స్ఫర్ చేశారు. బినాన్సి క్రిప్టో, పేమెంట్ గేట్‌వే, గేమింగ్ యాప్‌ల ద్వారా ఆ డబ్బులను ఇతర అకౌంట్లకు మళ్లించినట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్ల (Cyber criminals) నుంచి సుమారు రూ.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతర అకౌంట్లలో వారు దాచుకున్న డబ్బును ఫ్రీజ్ చేసినట్లుగా సైబర్ పోలీసులు తెలిపారు.
సులభంగా డబ్బులు సంపాదించాలనే ప్రక్రియలో ఇలా చాలా మంది మోసపోతున్నారని, ఆన్లైన్ ద్వారా ఇలా డబ్బులు పొందడం కోసం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని ఈ సందర్భంగా పోలీసులు వెల్లడించారు. గతంలో లోన్ యాప్‌ల (Loan Apps) ద్వారా అత్యధిక మోసాలు జరిగాయని, ఇప్పడు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.